గాడ్ స్పీక్స్
“నేనెవరు?
నేను ఎక్కడి నుండి వచ్చాను?
నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?
నేను ఎక్కడికి పోతున్నాను?”
ఇలాంటి ప్రశ్నలు మనకు ఏదో ఒక దశలో తప్పక కలుగుతుంటాయి. అయితే, ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎవరు చెప్పగలరు.
సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడే —అంతర్లీనమైన నిజాలను వెలికి తీసి, ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడు.
ఆ భగవంతుడే మానవరూపంలో ఈ యుగంలో మెహెర్ బాబాగా మన మధ్య అవతరించి, "గాడ్ స్పీక్స్" గ్రంథరూపంలో ఈ ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలను అందించారు. ఇది మానవుని ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు ఒక అపూర్వమైన నూతన చేరిక అని చెప్పవచ్చును.
ఈ గ్రంథం గురించి బాబా ఇలా పేర్కొన్నారు:
“గాడ్ స్పీక్స్ గ్రంథాన్ని తప్పక చదవండి. మీలో ప్రతి ఒక్కరి దగ్గర ఈ గ్రంథం ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొనలేకపోతే, కనీసం ఎవరి నుంచైనా తీసుకుని చదవండి. చదవలేకపోతే, ఎవరో ఒకరు మీకు చదివి వివరించి చెప్పేలా చూసుకోండి. ఈ గ్రంథంలో ఇప్పటివరకు ఎప్పుడూ బయటపెట్టబడని కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేను వెల్లడించాను.
వీటి అనువాదాలను వీలైనన్ని భారతీయ భాషల్లో సిద్ధం చేయించండి. ఇది మీ మనస్సుకు గొప్ప శాంతిని, ఆనందాన్ని కలిగిస్తుంది.”
________________________________________
గ్రంథ పరిచయం
గాడ్ స్పీక్స్: సృష్టి మరియు దాని ప్రయోజనముల ఇతివృత్తం
ఈ గ్రంథం, పరమాత్మ నుండి భగవదనుభవం వరకు సాగే ఆత్మ యొక్క ప్రయాణాన్ని లోతుగా విశ్లేషిస్తుంది.
సృష్టి తత్వం, దాని అంతర్గత మర్మాలు, ఆత్మ యొక్క పరిణామక్రమం, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణం, చివరికి భగవదనుభూతి వరకు సాగే ఆధ్యాత్మిక చైతన్య పథాన్ని అవతార్ మెహెర్ బాబా ఈ గ్రంథంలో అత్యంత లోతుగా వివరిచారు.
ఈ రచనలో సూఫీ, మార్మిక (mystic), వేదాంత తత్వాల్లో కనిపించే పదాలను, భావనలను సమన్వయపరిచి, సాధారణ పాఠకుడు కూడా గ్రహించగలిగే స్థాయిలో అతి దార్శనికమైన విషయాలను స్పష్టంగా వివరించారు.
మీరు ఒక ఆధ్యాత్మిక సాధకుడైనా, లేక జీవితానికి లోతైన అర్థం తెలుసుకోవాలనుకునే పరిశీలకుడైనా —
"గాడ్ స్పీక్స్" మీ జ్ఞానాన్వేషణలో ఒక దిక్సూచిగా దోహదపడుతుంది. ఇది కొత్త దృష్టికోణాన్ని అందించడమే కాకుండా, జీవితంపై లోతైన స్పష్టతను కలిగిస్తుంది.
________________________________________
ప్రధానాంశాలు
• సృష్టి యొక్క ఆరంభం మరియు ఆత్మ యొక్క పరిణామ క్రమం
• పునర్జన్మ ప్రక్రియ మరియు దాని ఉద్దేశ్యం
• ఏడు చైతన్య భూమికల ద్వారా సాగే అంతర్ముఖ ఆధ్యాత్మిక ప్రయాణం
• భగవదనుభూతి, సద్గురువు పాత్ర, అవతారుని పాత్ర
________________________________________
ఈ గ్రంథాన్ని చదివిన తరువాత, పాఠకుని దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది. ఒక చెట్టును చూస్తే — "నేను కూడా ఒకప్పడు చెట్టునే… ఈ చెట్టు కూడా భవిష్యత్తులో ఏదో ఒక రోజు మానవునిగా రూపాంతరం చెందుతుంది" అనే విశ్వదృష్టి కలుగుతుంది. సృష్టి వెనుక ఉన్న ఆంతరిక తత్వాన్ని, భగవంతుని భావనను మానవబుద్ధికి అందుబాటులోకి తీసుకురావడంలో ఈ గ్రంథం అపూర్వమైనదిగా నిలుస్తుంది.
భగవంతుడు మరియు సృష్టి అనే మహామర్మాన్ని సుస్పష్టంగా వివరించే ఈ గాడ్ స్పీక్స్ అనే అరుదైన ఆధ్యాత్మిక గ్రంథాన్ని అందరూ తప్పకుండా చదవాలి!